ప్రొద్దుటూరు: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా స్థానిక ఉపాధ్యాయ సేవా కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ వాజపేయి గొప్ప రాజకీయ నాయకుడిగా, కవిగా, రచయితగా, వక్తగా దేశ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలు, జాతీయ రహదారుల అభివృద్ధి, స్వర్ణ చతుర్భుజి వంటి కార్యక్రమాలతో దేశాభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.
డాక్టర్ టి.డి. వరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరులో వాజపేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన సేవలను భావితరాలకు పరిచయం చేయాలని సూచించారు. విగ్రహ ప్రతిష్ఠకు అవసరమైన పీఠాన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తామని అబ్దుల్ కలాం భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ప్రకటించారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, రవిశంకర్, బోగా గంగాధర్, షేక్ షా వల్లీ, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.



