కడప జిల్లా: టి.సుండుపల్లిలో గత నెల 22న జరిగిన జయరాం, రవీంద్రల మృతి కేసును పోలీసులు ఛేదించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన.. ఇంటి స్థలం వివాదం కారణంగా పక్కా ప్రణాళికతో చేసిన జంట హత్యలుగా దర్యాప్తులో తేలింది.
అశోక్ లేలాండ్ వాహనంతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి ఇద్దరినీ హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధాన నిందితుడు శివశంకర్ తన అనుచరులతో కలిసి ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. పోలీసుల దర్యాప్తుతో శివప్రసాద్, చరణ్ వీఆర్వో ఎదుట లొంగిపోగా వారిని అరెస్ట్ చేశారు.
నేరానికి ఉపయోగించిన అశోక్ లేలాండ్ వాహనం, సుజుకి యాక్సెస్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు శివశంకర్‌తో పాటు మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించినట్లు సీఐ సురేష్ రెడ్డి తెలిపారు.



