పులివెందుల, ఆగస్టు 9: డీఎస్సీ నియామకాలపై అసెంబ్లీలో చర్చించేందుకు వైసీపీ నాయకులు ముందుకు రావాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కోరారు. ఆదివారం పులివెందుల వైఎస్సార్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద ఎలాంటి అవకతవకలు జరగలేదని, గత ప్రభుత్వ విధానాల ప్రకారమే నియామకాలు చేపట్టామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎస్సీపై తొలి సంతకం చేశారని, ఎస్సీ వర్గీకరణ కారణంగా కొంత ఆలస్యం జరిగినా నియామక ప్రక్రియను అధికారులు పారదర్శకంగా పూర్తి చేశారని అన్నారు. ఆధారాలు లేకుండా వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ చర్చకు ఆహ్వానించినా రాకుండా నిరసనలు, దీక్షలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ నెల 17న జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి డీఎస్సీతో పాటు ఇతర అంశాలపై చర్చించాలని వైఎస్ జగన్ను కోరారు.



