బద్వేలు, ఆగస్టు 08 :
మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బద్వేలు టీడీపీ ఇంచార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. శనివారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించి 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని తెలిపారు.
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ఆధారాలు చూపించి బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు చేపడుతోందన్నారు. తప్పుడు ఆరోపణలు, దొంగ దీక్షలతో వైసీపీకి రాజకీయ సమాధి తప్పదని సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు.



