కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో శాకంబరీ దేవి అలంకార మహోత్సవం గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో శాకంబరీ దేవిగా అలంకరించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన చేశారు. సాయంత్రం ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహా మంగళహారతి, తీర్థ ప్రసాదాలు, భోజన ప్రసాదం పంపిణీ చేశారు. ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బళ్లాని చెన్నకేశవ ప్రసాద్, కార్యదర్శి కోట అశోక్ కుమార్, మహిళా మండలి అధ్యక్షురాలు బళ్లాని సునంద, పలువురు ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.



