రాయచోటి: దేశ యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, నాయకత్వ వికాసం వంటి అనేక అవకాశాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మై భారత్ (MY Bharat) పోర్టల్లో విద్యార్థులు, ఛాత్రోపాధ్యాయులు తప్పనిసరిగా నమోదు కావాలని డైట్ రాయచోటి ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి సూచించారు.
శుక్రవారం డైట్లో నిర్వహించిన మై భారత్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పోర్టల్ ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునే అవకాశాలతో పాటు కెరీర్ గైడెన్స్, ఇంటర్న్షిప్లు, వివిధ శిక్షణా కార్యక్రమాలు, ప్రభుత్వ యువజన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో డిజిటల్ వేదికలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం మై భారత్ నోడల్ ఆఫీసర్ గిరిబాబు యాదవ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా నమోదు చేసుకునే విధానాన్ని విద్యార్థులకు వివరించారు.
కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు వెంకట సుబ్బారెడ్డి, మోహన్ నాయక్, వై.సి. రెడ్డప్పరెడ్డి, ఇలియాస్ అహ్మద్, ఓబుల్ రెడ్డి, తిరుపతి శ్రీనివాస్, ఉషా మాధురి తదితరులు పాల్గొన్నారు.



