రాయచోటి, ఆగస్టు 7:
రోడ్డు ప్రమాదంలో గాయపడి రాయచోటిలోని సాయి ప్రశాంతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెమ్మాడపల్లె మాజీ సర్పంచ్ పల్లపు వాసును రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు శుక్రవారం పరామర్శించారు. రాయచోటి మండలం పెమ్మాడపల్లెకు చెందిన పల్లపు వాసు గురువారం రాత్రి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై కాలికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ప్రసాద్ బాబు ఆసుపత్రికి వెళ్లి వాసు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకుని వాసును తిరుపతిలోని అమర ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. త్వరితగతిన కోలుకునేలా అవసరమైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. పల్లపు వాసు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని సుగవాసి ప్రసాద్ బాబు ఆకాంక్షించారు.



