ప్రొద్దుటూరు, ఆగస్టు 7: ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వచ్ఛ సంకల్ప దీక్షకు ఇస్కాన్ నిర్వాహకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్లాస్టిక్ నిర్మూలన కోసం మున్సిపాలిటీ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను అభినందించారు.
ఆగస్టు 15న జరిగే స్వచ్ఛ సంకల్ప దీక్షలో ఇస్కాన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాటు, కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన అన్ని విధాలా సహకారం అందిస్తామని కమిషనర్‌కు హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రొద్దుటూరును పరిశుభ్రమైన, ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అందరూ కలిసి ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.



