ప్రొద్దుటూరు, జూలై 27 (కలం మనస్సాక్షి ప్రతినిధి): తల్లికి వందనం పథకం నిజంగా తల్లులకు వందనమా, లేక వంచననా అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రతి తల్లికి రూ.15,000 అమ్మఒడి అందజేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, మొదటి ఏడాదిలో ఆ హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే సుమారు 80 లక్షల మంది విద్యార్థులకు పథకం వర్తిస్తుందని ప్రకటించినప్పటికీ, కేవలం 60 లక్షల మందికే లబ్ధి చేకూర్చి మిగిలిన వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసి అర్హులైన ప్రతి విద్యార్థికి పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.



