రాయచోటి, జూలై 7: కడప జిల్లా జమ్మలమడుగులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు రాయలసీమ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచే నిర్ణయమని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు.
శనివారం రాయచోటి గాలివీడు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రూ.4,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి నాంది పలకడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే రాయలసీమలో భారీ పెట్టుబడులు, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, రహదారులు, పారిశ్రామిక పార్కులు వంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు.
యువతకు ఉద్యోగాలు, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్, గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాయలసీమ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వైసీపీ పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో రాయలసీమకు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, అభివృద్ధి కంటే విధ్వంసమే ఎక్కువ జరిగిందని విమర్శించారు.
రాయలసీమ ప్రజలు అభివృద్ధి ఎవరు చేస్తున్నారో, అడ్డుకుంటున్నారో గుర్తించారని, కూటమి ప్రభుత్వం మాటలతో కాకుండా చేతలతో అభివృద్ధిని నిరూపిస్తోందని అన్నారు. 2029 నాటికి రాయలసీమ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



