తిరుపతి జిల్లా రైల్వే కోడూరు, మార్చి 21 (మనస్సాక్షి): పవిత్ర రంజాన్ నెల ముగింపు సందర్భంగా శనివారం రైల్వే కోడూరు మండల పరిధిలోని మైసూర్ వారిపల్లి గ్రామ పంచాయతీ సమీపంలో ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 6:00 గంటలకు జరిగిన ఈ ప్రార్థన కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి అధ్యక్షులు, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి తనయుడు, టిడిపి యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ, ముస్లిం సోదరులు నెలంతా ఉపవాసం పాటిస్తూ ఆచరించే ఈ పవిత్ర సంప్రదాయం గొప్ప భక్తి, నియమనిష్టలకు నిదర్శనమని అన్నారు. ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి సాధిస్తూ, సమాజంలో ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు.
అల్లాహ్ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ముస్లిం సోదరుల ప్రార్థనలు సమాజ శాంతి, అభివృద్ధికి దోహదం చేయాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర సందర్భంగా ప్రతి కుటుంబం ఆనందంగా, సుఖసంతోషాలతో ఉండాలని అభిలషించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, మత పెద్దలు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.