రైల్వే కోడూరు, ఫిబ్రవరి 25 (మనస్సాక్షి):
జనసేన పార్టీ చేపట్టిన “ఉద్యమి సభ్యత్వ నమోదు” కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. ఇందులో భాగంగా పార్టీ నియమించిన రాజంపేట పార్లమెంటరీ పరిశీలకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా రైల్వే కోడూరులోని పార్టీ కార్యాలయానికి విచ్చేసారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, నాయకులు జనసైనికులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం జరగిన సమావేశంలో కళ్యాణం శ్రీనివాసరావు మాట్లాడుతూ, కొత్త నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరికీ ఇది బృహత్తర అవకాశం అని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు ద్వారా అన్ని వర్గాల ప్రజలను పార్టీకి దగ్గర చేయవచ్చని, ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని పేర్కొన్నారు.ఈ నెల 26 నుంచి మార్చి 10 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పంచాయతీలో విస్తృతంగా పర్యటించి మెజారిటీ సభ్యత్వాలు నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జనసేన రాయలసీమ జోన్–1 ఇన్‌చార్జ్ జోగినేని మణి, వరలక్ష్మి, బత్తిన గంగయ్య యాదవ్, సంయుక్త, ముత్యాలు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.