అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు – జిల్లా వ్యాప్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఫిబ్రవరి 23 మనస్సాక్షి:

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమవారం నాడు తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి విక్రయాల నియంత్రణ, అనుమానాస్పద కార్యకలాపాల అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి.

రైల్వే కోడూరు పరిధిలోని సమతానగర్ ప్రాంతంలో కొడూరు సర్కిల్ సీఐ లు, ఎస్‌ఐ లు, పోలీస్ సిబ్బంది కలిసి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఇళ్లలో సోదాలు నిర్వహించి, రికార్డులు లేని 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించి, స్థానికులతో బాలికల భద్రత, గంజాయి వలన కలిగే దుష్ప్రభావాలు, నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎటువంటి అనుమానాస్పద సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరంగా కొనసాగుతాయని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp