అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని చెన్నముక్కపల్లి గ్రామంలో ఉన్న లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 14 మంది రోగులకు విజయవంతంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గంతో పాటు రాజంపేట, రైల్వే కోడూరు, సుండుపల్లె, వీరబల్లి, యర్రావారిపాలెం, కేవీపల్లి, కలకడ, కలికిరి, పీలేరు, గుర్రంకొండ, పెద్దమండెం, ఎన్‌పి.కుంట, చక్రాయపేట, కడప తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 30 మందికి పరీక్షలు నిర్వహించి, అర్హులైన 14 మందికి శస్త్రచికిత్స చేశారు. గతంలో ఆపరేషన్ చేయించుకున్న 25 మందికి పునఃపరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేశారు. ఆపరేషన్ల కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులకు గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ మోటుకు గ్రామానికి చెందిన ఎన్నారై ఎర్రగొండ గోవర్ధన్ రెడ్డి సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి చైర్మన్ వైవిఆర్ స్వరూప్ గుప్తా, కోశాధికారి శివప్రసాద్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెన్నూరు అన్వర్ భాష, కంటి వైద్యులు సురేష్ బాబు, భార్గవి, ఆత్మాలిక్ అసిస్టెంట్ మూలి రాజగోపాల్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.