వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జిల్లా నాయకులు కొరముట్ల, సుధాకర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్. జయచంద్ర, వీఆర్ఏ సంఘం గౌరవాధ్యక్షుడు ఏ. పుల్లయ్య, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు జి. బాలసుబ్రహ్మణ్యం, సి.హెచ్. చంద్రశేఖర్ మాట్లాడారు.
రాష్ట్రంలో సుమారు 19,359 మంది వీఆర్ఏలు అత్యంత తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని, ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ప్రభుత్వ సేవలను గ్రామస్థాయిలో అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పార్ట్‌టైం ఉద్యోగులుగా ఉన్నప్పటికీ రాత్రి పగలు తేడా లేకుండా పని చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం జీతాలు పెంచకపోగా డీఏను కూడా ఉపసంహరించి రికవరీ చేసినట్లు విమర్శించారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా గత 19 నెలలుగా వీఆర్ఏల సమస్యలను పరిష్కరించలేదని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అటెండర్, నైట్ వాచ్‌మెన్, రీసర్వే వంటి అదనపు డ్యూటీలు వేస్తూ టీఏ, డీఏలను ఇవ్వడం లేదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న వీఆర్ఏలకు వీఆర్వోగా ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రమోషన్ కోటాను 20 శాతం నుండి 70 శాతానికి పెంచాలని కోరారు.
ఈ సందర్భంగా డీఆర్ఓ నరసింహులుకు వినతి పత్రం అందజేశారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మునిరాజా, గురవయ్య, హరినాథ్, వీఆర్ఏ సంఘం నాయకులు లక్ష్మీకర, మధు, కుమార్, తిరుపాల్, వెంకటసుబ్బయ్య, శివయ్య, రామచంద్రయ్య, జయరామ్, రంగయ్య, రాంబాబు, రాజేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.