*ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు
*జాగ్రత్తలతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట
కడప, ఏప్రిల్ 5 (కలం మనస్సాక్షి ప్రతినిధి): జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కడప వన్ టౌన్ ఎస్.ఐ అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా మార్గదర్శకాలు వివరించారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగం, వేగ పరిమితులను పాటించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా చైతన్యం కల్పించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలు ప్రాణనష్టాలకు దారితీస్తాయని పోలీసులు హెచ్చరించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. యువత ముఖ్యంగా నియమాలను పాటించడంలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రజలు కూడా మంచి స్పందన చూపించారు.