అన్నమయ్య జిల్లా: స్వరాజ్య సంగ్రామ చరిత్రలో అల్లూరి ఒక మహోజ్వల శక్తి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని డిఆర్ఓ మధుసూదన్ రావు పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లో లోని పి జి ఆర్ ఎస్ హాల్ నందు యువజన సర్వీసుల శాఖ, స్టెప్ ఆధ్వర్యంలో శ్రీ అల్లూరి సీతారామరాజు 128 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి డిఆర్ఓ మధుసూదన్ రావు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన్యం వీరుడు అల్లూరి స్వాతంత్య్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడన్నారు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులకు అండగా నిలిచి బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడని, ఆయన చూపిన ధైర్యం తెగువ భావితరాలకు ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ సీఈఓ సాయి గ్రేస్ లీ , మేనేజర్ వివి సుబ్బరాయుడు,డిఇఓ సుబ్రహ్మణ్యం, ఏపీ టూరిజం అధికారి నాగభూషణం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
